Uttarakhand: ఎన్నికల్లో ఓడినా!.. పుష్కర్ సింగ్‌కే ఉత్తరాఖండ్ సీఎం పీఠం!
- ఉత్తరాఖండ్‌లో క్లియర్ మెజారిటీతో బీజేపీ విక్టరీ
- సీఎంగా కొనసాగుతున్న పుష్కర్ సింగ్‌కు ఓటమి
- అయినా పుష్కర్‌కే సీఎం బాధ్యతలు అప్పగిస్తూ బీజేపీ నిర్ణయం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఇటీవలే రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత పుష్కర్ సింగ్ ధామికే మరోమారు ఆ పీఠం దక్కనుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికైనట్లు బీజేపీ ప్రకటించింది.
ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా బీజేపీ పాలనలోనే కొనసాగుతున్న ఉత్తరాఖండ్‌లో మరోమారు బీజేపీ క్లియర్ మెజారిటీతోనే విజయం సాధించింది. 70 సీట్లున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీ 48 సీట్లను గెలుచుకుంది. అయితే సీఎంగా కొనసాగుతున్న పుష్కర్ సింగ్ ధామి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఉత్తరాఖండ్‌లో బీజేపీ వరుసగా రెండో సారి అధికారం నిలబెట్టుకున్నా.. పుష్కర్ మాత్రం సీఎంగా కొనసాగలేరన్న వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను పటాపంచలు చేస్తూ పుష్కర్‌కే మరోమారు ఉత్తరాఖండ్ సీఎం పదవిని కట్టబెడుతూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.