Central Vista: పార్లమెంటు భవనానికి చెల్లు.. సెంట్రల్ విస్టాలో శీతాకాల సమావేశాలు
- 44 శాతం నిర్మాణం పూర్తి అయిన సెంట్రల్ విస్టా
- ఇప్పటిదాకా రూ.480 కోట్ల ఖర్చు
- ఇంకో రూ.1,423 కోట్లతో మిగిలిన పనుల పూర్తి
- రాజ్యసభలో కేంద్రం ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న పార్లమెంటు భవనానికి కేంద్ర ప్రభుత్వం చెల్లు చీటి ఇవ్వనుంది. వచ్చే శీతాకాల సమావేశాలను కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్రం సోమవారం నాటి రాజ్యసభ సమావేశాల్లో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పార్లమెంటు భవనం నిర్మించి చాలా కాలం అయిన నేపథ్యంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుత పార్లమెంటు భవనానికి సమీపంలోనే సెంట్రల్ విస్టా పేరుతో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కొత్త పార్లమెంటు భవన నిర్మాణంపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు స్పందించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ సమాధానం ఇచ్చారు. ఇప్పటిదాకా సెంట్రల్ విస్టాలో 44 శాతం నిర్మాణాలు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటిదాకా రూ.480 కోట్లను ఖర్చు చేశామని ఆయన తెలిపారు. ఇంకో రూ.1,423 కోట్లను వెచ్చించాల్సి ఉందన్న ఆయన.. వచ్చే శీతాకాల సమావేశాలను సెంట్రల్ విస్టాలోనే నిర్వహించనున్నట్లుగా చెప్పారు.