central universities: సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు కావాలంటే ఎంట్రన్స్ పాస్ కావాల్సిందే
- కొత్తగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్ టెస్ట్
- ఇందులో మార్కులే ప్రవేశాలకు ఆధారం
- ప్రకటించిన యూజీసీ చైర్మన్ కుమార్
- జూలైలో ప్రవేశ పరీక్ష
- ఏప్రిల్ నుంచి దరఖాస్తులకు అవకాశం
ఇంటర్ మెమో చేతికి అందితే సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు సంపాదించొచ్చులే! అనుకుంటే.. ఇకపై అలా కుదరదు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సిందే. అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) స్కోర్ ఆధారంగా విద్యార్థులకు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయని యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ తెలిపారు. అంతేకానీ, ప్రవేశాలకు ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోబోవన్నారు.
రిజర్వేషన్లపై సీయూఈటీ ప్రభావం ఉండదని కుమార్ స్పష్టం చేశారు. సీయూఈటీ స్కోరు ఆధారంగా జనరల్ సీట్లు, రిజర్వ్ డ్ సీట్లను యూనివర్సిటీలు భర్తీ చేసుకోవచ్చన్నారు. రిజర్వేషన్ పాలసీ ఇక ముందూ కొనసాగుతుందని, కాకపోతే రిజర్వేషన్ కు అర్హులైన వర్గాలు కూడా సీయూఈటీ ద్వారానే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.