YSRCP: మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేశారు: టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
- స్పీకర్‌కు దాదాపు ఐదు మీటర్ల దూరంలో ఉండి నిరసన తెలిపాం
- జగన్ సర్కారు మద్యంపై వచ్చే ఆదాయం మీదే దృష్టి పెట్టిందన్న గద్దె
- మార్షల్స్ సాయంతో సభను నడిపిస్తున్నారన్న భవానీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అనంతరం మరో ఇద్దరిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీలో బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు చాలా మంది ఉన్నారంటూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలు చేశారు. తాము అసెంబ్లీలో స్పీకర్‌కు దాదాపు ఐదు మీటర్ల దూరంలో ఉండి నిరసన తెలుపుతున్నామని, అయినప్పటికీ తమను అకారణంగా సస్పెండ్ చేశారని తెలిపారు.
జగన్ సర్కారు మద్యంపై వచ్చే ఆదాయం మీదే దృష్టి పెట్టిందని ఆయన ఆరోపించారు. సభలో వైసీపీ నేతల ప్రవర్తన బాగోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నాటుసారాకు సంబంధించిన ఆధారాలను టీడీపీ ఎమ్మెల్యేలు బయటపెడుతుంటే సీఎం జగన్ ముఖం చాటేశారని ఆయన అన్నారు.
మార్షల్స్ సాయంతో సభను నడిపిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విమర్శించారు. తమలో ఎంతమందిని సస్పెండ్ చేసినప్పటికీ సభలో చిట్టచివరి సభ్యుడు ఉన్నంత వరకు కల్తీసారాపై పోరాడతారని ఆమె స్పష్టం చేశారు.