BJP: కొండారెడ్డి బురుజా?.. కోటిరెడ్డి సర్కిలా?: సీపీఐకి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రతి సవాల్
- సీపీఐ రామకృష్ణ సవాల్ ను స్వీకరిస్తున్నాం
- రాష్ట్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యం
- రాయలసీమ ద్రోహులు కమ్యూనిస్టులే
- బీజేపీ, జనసేన డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్న విష్ణు
రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సీపీఐ నేత రామకృష్ణ విసిరిన సవాల్‌కు బీజేపీ యువనేత విష్ణువర్ధన్ రెడ్డి వేగంగానే స్పందించారు. సీపీఐ విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని చెప్పిన విష్ణు.. చర్చకు వేదిక, సమయాన్ని సీపీఐ రామకృష్ణే నిర్ణయించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా బహిరంగ చర్చ ఎక్కడ పెట్టుకుందాం అంటూనే.. కర్నూలులోని కొండారెడ్డి బురుజు కావాలా? లేదంటే కడపలోని కోటిరెడ్డి సర్కిల్ కావాలో సీపీఐ రామకృష్ణే తేల్చుకోవాలని విష్ణు సూచించారు.
రాయలసీమ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని చెప్పిన విష్ణు.. బీజేపీ, జనసేన డబుల్ ఇంజిన్ సర్కారు రావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ద్రోహులు కమ్యూనిస్టులేనని ఆయన ఆరోపించారు. బీ టీం రాజకీయాలు చేసే కమ్యూనిస్టులకు సరైన సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమ అభివృద్ధికి బీజేపీ సర్కారు చేస్తున్న కృషిని కళ్లుండి చూడలేని కబోదుల్లా కమ్యూనిస్టులు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన పార్టీలని కూడా విష్ణు ఎద్దేవా చేశారు.