Revanth Reddy: కలిసిన భిన్న ధ్రువాలు.. ఉమ్మడిగా మీడియా ముందుకు రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఢిల్లీ పర్యటనలో రేవంత్
- పార్లమెంటు సమావేశాల కోసం అక్కడే వెంకటరెడ్డి
- కాంగ్రెస్‌ను వీడేది లేదని కోమటిరెడ్డి ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్‌లో మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్నటిదాకా కత్తులు దూసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిపోయారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. వెరసి నిన్నటిదాకా తమ మధ్య నెలకొన్న విభేదాలు మటుమాయం అయిపోయినట్టేనని ఇద్దరు నేతలు చెప్పినట్టయింది.
టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు నుంచి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి యత్నించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించడంతో భగ్గుమన్న కోమటిరెడ్డి.. తాను రేవంత్‌ను కలిసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలు చాలానే ఉంటాయని చెప్పిన కోమటిరెడ్డి.. అవన్నీ సర్దుకుంటాయని తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.