Ravi Pillai: ఇది అల్ట్రా నియో హెలికాఫ్టర్.. భారత్ లో తొలి సొంతదారు ఈయనే!

Kerala businessman owns costliest helicopter

  • అత్యాధునిక హెలికాప్టర్ తయారుచేసిన ఎయిర్ బస్ సంస్థ
  • ధర రూ.100 కోట్లు.. కొనుగోలు చేసిన ఆర్పీ గ్రూప్ చైర్మన్ రవి పిళ్లై
  • దుబాయ్ కేంద్రంగా ఆర్పీ గ్రూప్ కార్యకలాపాలు

ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ అత్యాధునిక సౌకర్యాలతో ఓ లగ్జరీ హెలికాప్టర్ ను అభివృద్ధి చేసింది. దీని ధర రూ.100 కోట్లు. ఈ అల్ట్రా నియో హెలికాప్టర్ ను ఎయిర్ బస్ హెచ్-145గా పిలుస్తారు. ఇలాంటివి ప్రపంచం మొత్తమ్మీద 1500 మాత్రమే ఉన్నాయి. ఈ చాపర్ లో పైలెట్ సహా ఏడుగురు ప్రయాణించే వీలుంది. ఇందులో సదుపాయాలకు తోడు భద్రతకు కూడా పెద్దపీట వేశారు. అత్యుత్తమం అనదగ్గ సెక్యూరిటీ ఫీచర్లను ఈ ఎయిర్ బస్ హెచ్-145 హెలికాప్టర్ లో పొందుపరిచారు. 

కాగా, ఈ హెలికాప్టర్ ను భారత్ లో తొలిసారిగా కొనుగోలు చేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణంగా రూ.100 కోట్లు అనగానే, ఏ అంబానీయో, అదానీయో కొనుగోలు చేసి ఉంటారని భావిస్తుంటారు. కానీ, వారెవ్వరూ కాకుండా, కేరళకు చెందిన బి.రవి పిళ్లై అనే వ్యాపారవేత్త ఈ హైటెక్ లగ్జరీ హెలికాప్టర్ ను కొనుగోలు చేశారు. రవి పిళ్లై ప్రతిష్ఠాత్మక ఆర్పీ గ్రూప్ కు అధిపతి. 

ఈ గ్రూప్ కు కేరళ వ్యాప్తంగా స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఇంకా అనేక వ్యాపారాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. దుబాయ్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ఆయన కంపెనీల్లో 70 వేల మంది ఉద్యోగులు వివిధస్థాయుల్లో పనిచేస్తుంటారు. రవి పిళ్లై వయసు 68 ఏళ్లు. ఆయన సంపద విలువ రూ.19 వేల కోట్లు. 

ఈ హెలికాప్టర్ 22 వేల అడుగుల ఎత్తువరకు ఎగురుతుంది. ఇది ఫైవ్ బ్లేడ్ హెలికాప్టర్. ఈ తరహా ఏర్పాటు ఉన్న హెలికాప్టర్ ఆసియాలో ఇదొక్కటే. ఈ లగ్జరీ చాపర్ ను మెర్సిడెస్ బెంజ్ సంస్థ డిజైన్ చేయడం విశేషం. కోవళంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎయిర్ బస్ సంస్థ ఈ హెలికాప్టర్ ను ఆర్పీ గ్రూప్ కు అందించింది.
.

  • Loading...

More Telugu News