Qualcomm: హైదరాబాద్‌లో క్వాల్ కామ్ రెండో అతిపెద్ద క్యాంపస్.. అక్టోబర్‌లో ప్రారంభం
- క్వాల్ కామ్ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ
- అమెరికా వెలుపల రెండో అతిపెద్ద క్యాంపస్‌గా గుర్తింపు
- రానున్న ఐదేళ్లలో రూ.3904.5 కోట్ల పెట్టుబడికి సంస్థ అంగీకారం
అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ, టెక్నాలజీ దిగ్గజం క్వాల్ కామ్ తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి మంగళవారం కీలక ప్రకటన చేసింది. అమెరికా వెలుపల తమ సంస్థకు చెందిన రెండో అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నామని, ఈ ఏడాది అక్టోబర్‌లోనే దానిని ప్రారంభించనున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి కేటీఆర్.. తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. ఇప్పటికే రెండు సంస్థలు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేలా చేశారు. తాజాగా క్వాల్కామ్నూ హైదరాబాద్‌లో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేసేలా ఒప్పించారు. అంతేకాకుండా ఆ సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాల విస్తరణ కోసం రానున్న ఐదేళ్లలో రూ.3904.5 కోట్లను వెచ్చించేలా కేటీఆర్ ఒప్పించారు.