YSRCP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ వినూత్న నిరసన
- 120 మంది ఎంపీలతో సంతకాల సేకరణ
- లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ఒప్పుకోం
- ప్రధాని మోదీకి సంతకాలను అందజేస్తామన్న సాయిరెడ్డి
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీలో అధికార పార్టీ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా తాము చేపట్టబోయే పోరాటంలో మరిన్ని పార్టీలను భాగస్వామ్యం చేసే దిశగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికిపై ఎంపీలతో సంతకాలు చేయించి.. దానిని ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వనుంది.
ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంటులో సమావేశమైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరాలు వెల్లడించారు. లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని చెప్పిన ఆయన.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధానమంత్రికి నివేదిస్తామని వెల్లడించారు.