KCR: బోయగూడ ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం
- ప్రమాదంలో 11 మంది సజీవ దహనం
- మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు
- మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం
సికింద్రాబాద్ బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ దుకాణంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనలో 11 మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనం కావడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వారి మృతదేహాలను బీహార్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు. 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.