Telugudesam: ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు
- ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన
- కల్తీ సారా, జే బ్రాండ్ మద్యంపై సభలో చర్చించాలని డిమాండ్
- మద్యం తాగి వస్తున్నారని వైసీపీ ఆరోపణ
- ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈ రోజు కూడా నిరసన తెలిపారు. కల్తీ సారా, జే బ్రాండ్ మద్యంపై సభలో చర్చించాలని వారు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అందుకు స్పీకర్ అంగీకరించట్లేదన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు ప్రశ్నోత్తరాల వేళ అమూల్‌పై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానాలు చెబుతుండగా టీడీపీ సభ్యులు సభలో చిడతలు కొట్టారు.
అయినప్పటికీ, ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా సమాధానాలు చెప్పింది. అమూల్ వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. చిడతలు కొట్టిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సంస్కారం, ఇంగిత జ్జానం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు శాసనసభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో విజిల్స్ కూడా ఎందుకు వేశారని, ఇటువంటి భజనలు ఇక్కడ కాకుండా వేరే చోట్ల చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలకు ఓటేసిన ప్రజలు చూస్తున్నారని, ఇటువంటి పిల్ల చేష్టలు తగవని చెప్పారు. చంద్రబాబు నాయుడు చివరకు చిడతలు కొట్టుకోవాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు సభలో ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులు సభకు మద్యం తాగి వస్తున్నారేమోనని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అనుమానాలు వ్యక్తం చేశారు. కల్తీ సారా మరణాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం భయపడుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు.
కాగా, ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు -2022ను నేడు మంత్రి బుగ్గన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ఏపీ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోఆరపరేటివ్ సోసైటీస్ బిల్లు-2022ను మంత్రి కన్నబాబు మండలిలో ప్రవేశపెడతారు.