TDP: ఇలాగైతే ప‌రిశ్ర‌మ‌లు వెళ్లిపోవా?: ఎమ్మెల్యే తోపుదుర్తిపై ప‌రిటాల సునీత ఫైర్

paritala sunitha fires on ysrcp mla topudurthy prakash reddy

  • రాప్తాడులో ప్లాంట్ ఏర్పాటుకు జాకీ సంసిద్ధ‌త‌
  • తోపుదుర్తి రూ.15 కోట్లు డిమాండ్ చేయడం వల్లే పరిశ్రమ వెళ్లిపోయిందన్న సునీత 
  • చేతనైతే ఆ ప‌రిశ్ర‌మ‌ను తిరిగి తీసుకురావాల‌ని డిమాండ్  

 వైసీపీ నేత‌, అనంత‌పురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డిపై మాజీ మంత్రి ప‌రిటాల సునీత నేడు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. రాప్తాడు ప‌రిధిలో త‌న యూనిట్‌ను ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వచ్చిన జాకీ ప‌రిశ్ర‌మ తోపుదుర్తి అవినీతి దందా కార‌ణంగానే వెన‌క్కెళ్లిపోయింద‌ని ఆమె ఆరోపించారు. జాకీ ప‌రిశ్ర‌మ త‌ర‌లివెళ్లిన వైనానికి నిర‌స‌న‌గా త‌న కుమారుడు ప‌రిటాల శ్రీరామ్‌తో క‌లిసి సునీత బుధ‌వారం రాప్తాడులో నిర‌స‌న‌కు దిగారు.

టీడీపీ హ‌యాంలో 2017లోనే రాప్తాడు ప‌రిధిలో త‌న ప్లాంటును ఏర్పాటు చేసేందుకు జాకీ ప‌రిశ్ర‌మ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింద‌ని సునీత పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు పూర్తయ్యేలోగానే.. 2019 ఎన్నిక‌లు రాగా.. ఆ తర్వాత వైసీపీ పాల‌న మొదలైందని ఆమె అన్నారు. 

రాప్తాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తోపుదుర్తి.. జాకీ ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యం నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేశార‌ని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే డిమాండ్ల‌ను విన్న జాకీ ప‌రిశ్ర‌మ రాప్తాడులో పెట్టాల‌నుకున్న ప్లాంట్ యోచ‌న‌ను విర‌మించుకుంద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నేత‌ల‌కు చేతనైతే ఆ ప‌రిశ్ర‌మ‌ను తిరిగి తీసుకురావాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

జాకీ ప‌రిశ్ర‌మ ఏర్పాటై ఉంటే.. రాప్తాడు ప‌రిధిలో ఏకంగా 6 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించేవని టీడీపీ యువ‌నేత ప‌రిటాల శ్రీరామ్ అన్నారు. అలాంటి ప‌రిశ్ర‌మ‌ను త‌మ అవినీతి దందాతో వెళ్ల‌గొట్టిన వైసీపీ నేత‌లు.. రాష్ట్ర యువ‌త‌కు అందివ‌చ్చిన ఉపాధి అవ‌కాశాల‌ను కాల‌రాశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కంపెనీల నుంచే కాకుండా ప్ర‌జ‌ల నుంచి కూడా వ‌సూళ్లు రాబ‌డుతున్న తోపుదుర్తి త‌న ఆస్తుల‌ను పెంచుకుంటున్నార‌ని శ్రీరామ్ ధ్వ‌జ‌మెత్తారు. రాప్తాడుకు ప్రకాశ్ రెడ్డి గ్ర‌హ‌ణం ప‌ట్టింద‌న్న ఆయ‌న‌.. టీడీపీ గెలుపుతోనే ఆ గ్ర‌హ‌ణం వీడుతుంద‌న్నారు.

  • Loading...

More Telugu News