AAP: బీజేపీ గెలిస్తే రాజకీయ సన్యాసం.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్య
- ఢిల్లీలోని మూడు నగరపాలికలను కలుపుతూ బీజేపీ బిల్లు
- ఎన్నికలను జాప్యం చేసేందుకే ఈ నిర్ణయమన్న కేజ్రీ
- ఎన్నికల జాప్యంతో సమర యోధులను అవమానించినట్టేనని వ్యాఖ్య
ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలను సకాలంలో నిర్వహించి.. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో బీజేపీకి కేజ్రీ సవాల్ విసిరారు. ఢిల్లీలో మునిసిపల్ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోందని ఆరోపించిన కేజ్రీ.. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుంటే.. స్వాతంత్ర్య సమరయోధులను అవమానపరిచినట్టేనని వ్యాఖ్యానించారు.
బుధవారం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బీజేపీ ఓ బిల్లును ప్రతిపాదించింది. ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్లను కలిపేస్తూ ఓ ప్రతిపాదన పెట్టింది. ఈ విషయం తెలిసినంతనే కేజ్రీ ఆగ్రహోదగ్రుడయ్యారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఆప్ లాంటి అతి చిన్న పార్టీని చూసి జడుసుకుంటోందని ఎద్దేవా చేశారు. మునిసిపల్ ఎన్నికలను సకాలంలో నిర్వహించడంతో పాటుగా ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఆప్ రాజకీయ సన్యాసం చేస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.