KCR: ధాన్యం సేకరణపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
- ధాన్యం సేకరణపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించాలి
- సీఎంలతో పాటు వ్యవసాయ రంగ నిపుణులను ఆహ్వానించాలి
- ధాన్యం సేకరణ కోసం దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం ఉండాలన్న కేసీఆర్
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఓ లేఖ రాశారు. యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ఇప్పటికే ఓ కార్యాచరణను రూపొందించిన కేసీఆర్.. కేంద్ర మంత్రులతో భేటీ కోసం తన మంత్రివర్గ సహచరుల బృందాన్ని ఇప్పటికే ఢిల్లీ పంపారు. అంతేకాకుండా పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఫలితం సాధించే దిశగా కదలాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
యాసంగిలో వచ్చే మొత్తం ధాన్యాన్ని కేంద్రం చేత కొనిపించడమే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్.. ప్రధాని మోదీకి బుధవారం లేఖ రాశారు. ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం అన్న నినాదాన్ని ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన కేసీఆర్.. ఈ విషయంపై ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ప్రధానికి సూచించారు. ఈ సమావేశానికి వ్యవసాయ రంగ నిపుణులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని కూడా సూచించారు. కనీస మద్దతు ధర, లాభదాయక పంటల సాగు, వైవిధ్యమైన పంటల సాగు తదితర అంశాలను కూడా ఆ లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు.