Punarnavi: రేపు ఢిల్లీకి పంజాబ్ సీఎం.. ప్రధాని మోదీతో భేటీ
- ఢిల్లీ మునిసిపోల్స్‌పై ఆప్, బీజేపీ మధ్య వార్
- బీజేపీపై ఆప్ అధినేత కేజ్రీ సంచలన వ్యాఖ్యలు
- వెరసి మాన్, మోదీల భేటీపై ఆసక్తికర విశ్లేషణలు
సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు వాయిదా పడేలా వ్యవహరిస్తున్న బీజేపీ సర్కారుపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నాడు తనదైన శైలిలో సవాల్ సంధించారు. మొత్తంగా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆప్ కీలక నేత, ఇటీవలే పంజాబ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్ గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
ఏదైనా రాష్ట్రానికి కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన నేతలు మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అవుతుండటం సర్వసాధారణమే. ఈ దిశగానే సాగుతున్న మాన్, మోదీల భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.