India: బ్రహ్మోస్ ఉపరితల క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
- అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రయోగం
- పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
- దీవుల్లో బలగాల కార్యాచరణ సంసిద్ధతలను సమీక్షించిన ఎయిర్ చీఫ్ మార్షల్
భారత్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) నిన్న విజయవంతంగా పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైనట్టు డీఆర్‌డీవో తెలిపింది. ఈ విస్తృత శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఇతర రక్షణ అధికారుల సమక్షంలో నిర్వహించారు. పూర్తి కచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, అండమాన్, నికోబార్ దీవులలో బలగాల కార్యాచరణ సంసిద్ధతను ఎయిర్ చీఫ్ మార్షల్ సమీక్షించారు.
బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన వార్తలు ఇటీవల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కమాండ్ ఎయిర్‌స్టాప్ ఇన్‌స్పెక్షన్ (సీఏఎస్ఐ) సమయంలో భారత వాయుసేన యూనిట్ నుంచి సాంకేతిక లోపం కారణంగా మిస్‌ఫైర్ అయి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకుపోయి కలకలం రేపింది. అయితే, నిరాయుధ క్షిపణి అయిన దీని వల్ల స్వల్ప నష్టం మాత్రమే జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్‌కు లేఖ రాసింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ క్షిపణిని నింగి, నేల, ఉపరితలం నుంచి కూడా ప్రయోగించవచ్చు.