Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు షాకిచ్చిన మూడు మిత్ర పక్షాలు

3 parties of Imran Khan alliance joins hands with opposition
  • ఈ నెలాఖరున అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న ఇమ్రాన్ ప్రభుత్వం
  • విపక్షాలతో చేయి కలిపిన మూడు మిత్రపక్ష పార్టీలు
  • ఇప్పటికే ఇమ్రాన్ పై తిరుగుబాటు చేసిన 24 మంది సొంత పార్టీ సభ్యులు
పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నెలఖరున ఆయన ప్రభుత్వం జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు మరో పెద్ద షాక్ తగిలింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మూడు పార్టీలు విపక్షంతో చేతులు కలిపాయి. ముత్తాహిదా క్వామీ మూమెంట్ పాకిస్థాన్, పాకిస్థాన్ ముస్లిం లీగ్ క్వాయిద్, బలోచిస్థాన్ అవామీ పార్టీలు ఇమ్రాన్ ను గద్దె దించేందుకు విపక్షంతో చేతులు కలపనున్నట్టు జియో న్యూస్ తెలిపింది.  

ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సొంత పార్టీకి చెందిన 24 మంది నేతలు ఆయనకు ఇప్పటికే షాకిచ్చారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వారు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 8న జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్ కు విపక్ష పార్టీలు సమర్పించాయి. 

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తనను పదవి నుంచి దింపితే విపక్షాలకు మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. మార్చి 27న ఆయన ఒక ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ భారీ ర్యాలీ ద్వారా తన పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపాలని ఆయన భావిస్తున్నారు.
Imran Khan
Pakistan
No confidence Vote

More Telugu News