Nara Lokesh: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యపై నారా లోకేశ్ భావోద్వేగం.. వైసీపీపై తీవ్ర విమర్శలు
- చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థి బలవన్మరణం
- అందుకు వైసీపీ నేతలే కారణమని ఆరోపణలు
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన నిరుపేద టెన్త్ విద్యార్ధిని మిస్బా ఆత్మహత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మిస్బా ఆత్మహత్యకు కారకులుగా నిలిచిన వైసీపీ నేత సునీల్.. అతడికి సహకరించిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కాసేపటి క్రితం వరుస ట్వీట్లలో విద్యార్థిని బలవన్మరణంపై భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఓ పత్రికలో కథనం రాగా... దానిపై లోకేశ్ భావోద్వేగంతో స్పందించారు.
మిస్బా ఆత్మహత్యకు కారకులైన వైసీపీ నేతలను ఆయన తాలిబన్లను మించిన కరుడుగట్టిన ఉగ్రవాదులుగా అభివర్ణించారు. వైకాపాకన్ల కంటే కూడా తాలిబన్లు నయమంటూ లోకేశ్ విమర్శించారు. పదో తరగతి పేపర్లు ఎత్తుకొచ్చిన చరిత్ర జగన్‌ది అయితే.. ఆయన పార్టీ నేతలది పదో తరగతిలో తన కూతురు టాపర్‌గా నిలవాలన్న భావనతో నిరుపేద విద్యార్థిని ఏకంగా వెంటాడి వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన నీచ చరిత్ర అంటూ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.