Telangana: కేసీఆర్ సర్కారుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఘాటు విమర్శలు
- ధాన్యం సేకరణలో తెలంగాణపై వివక్ష లేదు
- అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో సేకరణ
- కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న కేంద్ర మంత్రి గోయల్
తెలంగాణలో ఈ యాసంగిలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న కేసీఆర్ సర్కారుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారును ఆయన రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణించారు. టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూడా గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణకు సంబంధించి తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్న గోయల్.. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి కూడా రా రైస్‌ను సేకరిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
అయితే, అన్ని రాష్ట్రాలు కేంద్రానికి ఎంత మేర రా రైస్ అందిస్తున్నాయన్న విషయాన్ని చెప్పాయని.. ఒక్క తెలంగాణ మాత్రం ఆ వివరాలు అందజేయడం లేదని కూడా గోయల్ ఆరోపించారు. ఈ విషయంలో తాము ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ సర్కారు నుంచి స్పందన ఉండటం లేదని గోయల్ మండిపడ్డారు.