Chittoor District: టెన్త్ విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసు.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు
- ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్ సస్పెన్షన్
- బ్రహ్మర్షి స్కూలు తాత్కాలికంగా మూసివేత
- టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య కేసుకు సంబంధించి చిత్తూరు జిల్లా బ్రహ్మర్షి స్కూల్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేశ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటేశారు. ఈ మేరకు చిత్తూరు డీఈవో శేఖర్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పాఠశాలను కూడా తాత్కాలికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
మిస్బా ఆత్మహత్యకు కారకులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీడీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ఆధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ పలమనేరులో నిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ మైనార్టీ, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని సీఐ భాస్కర్ ముందు తమ డిమాండ్లు ఉంచారు. అలాగే, నిందితులను అరెస్ట్ చేయకుండా బాధిత బాలిక మిస్బా తల్లిదండ్రులను నిన్న ఉదయం నుంచి పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రశ్నించడం ఏంటని ప్రశ్నించారు.