Harish Rao: బీజేపీ కేంద్రమంత్రులు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: హరీశ్ రావు
- వైద్య కళాశాలల అంశంలో కేంద్రాన్ని నిలదీసిన హరీశ్
- ప్రతిపాదనలు రాలేదని చెబుతున్నారని ఆరోపణ
- గతంలో నడ్డా రాసిన లేఖను పంచుకున్న వైనం
కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల అంశంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ కేంద్రమంత్రులు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు రాలేదని మొన్న అసత్యాలు చెప్పగా, మెడికల్ కాలేజీల కోసం ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని నేడు మరోసారి అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు వివరించారు. ఇది చాలా దారుణం, బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
2015లో అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రిగా ఉన్న జేపీ నడ్డా... నాటి తెలంగాణ ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డికి రాసిన లేఖను కూడా హరీశ్ రావు పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలలపై పంపిన ప్రతిపాదనలకు ఆ లేఖలో నడ్డా బదులిచ్చారు. ఈ లేఖ ఆధారంగానే హరీశ్ రావు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు.