Singireddy Niranjan Reddy: బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారు.. ఇప్పుడు కేంద్ర సర్కారు ధాన్యాన్ని కొనట్లేదు: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి
- తెలంగాణలో వరి సాగు చేయాలని అన్నారు
- ఇప్పుడు ధాన్యాన్ని కొనాలని కేంద్రాన్ని ఎందుకు అడగట్లేదు?
- తెలంగాణ మంత్రులు, ప్రజలను పీయూష్ అవమానించారు
- కేంద్ర మంత్రులు అవగాహనారాహిత్యంతో ఉన్నారన్న నిరంజన్ రెడ్డి
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరుపై రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, బీజేపీ తెలంగాణ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన మండిపడ్డారు. తెలంగాణలో వరి సాగు చేయాలని రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ధాన్యాన్ని కొనాలని ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని ఆయన నిలదీశారు.
తెలంగాణలో యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, బాయిల్డ్ రైస్ కొనకపోతే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. ధాన్యాన్ని కొని కేంద్రమే మిల్లింగ్ చేసుకోవాలని ఆయన చెప్పారు. అంతేగాక, బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని ఆయన విమర్శించారు.
రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించట్లేదని, మరి ఇక కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారికోసమైనా ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందని అన్నారు. కేంద్ర మంత్రులు అవగాహనారాహిత్యంతో ఉన్నారని, తెలంగాణ ప్రజలు దీన్ని సహించబోరని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మార్పులు సూచిస్తే దాన్ని స్వీకరించే ఔదార్యం కూడా కేంద్ర మంత్రులకు లేదని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్తే వారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానించారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అలాగే, రాష్ట్ర ప్రజలను కూడా అవహేళన చేస్తూ మాట్లాడారని మండిపడ్డారు.
తెలంగాణలో నూకలు తినే అలవాటును పెంచమని సలహా ఇస్తూ, ప్రజలను ఆయన అవమానించారని చెప్పారు. గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ సర్కారు రాష్ట్రాలను పట్టించుకోవట్లేదని బీజేపీ నేతలు విమర్శించారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో యూపీఏను విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ ప్రభుత్వ ధోరణిలోనే వెళ్తున్నారని విమర్శించారు.