medicine: సామాన్యుడిపై మరో భారం.. వచ్చేనెల 1 నుంచి పలు ఔషధాల ధరల పెరుగుదల
- జ్వరం, ఇన్ఫెక్షన్లతో పాటు బీపీ, గుండె సంబంధిత వ్యాధుల ఔషధాలు ప్రియం
- 10.8 శాతం పెరగనున్నట్లు ఎన్పీపీఏ ప్రకటన
- 800 షెడ్యూల్డ్ మందుల ధరల పెంపు
ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఔషధాల ధరల పెరుగుదల రూపంలో వారిపై మరో పిడుగు పడనుంది. జ్వరం, ఇన్ఫెక్షన్లతో పాటు బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, అనీమియా వంటి వాటికి వాడే అత్యవసర ఔషధాల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. ఈ విషయంపై జాతీయ ఔషధాల ధరల సంస్థ (ఎన్పీపీఏ) ఓ ప్రకటనలో వివరాలు తెలిపింది. వీటి ధరలు 10.8శాతం పెరగనున్నట్లు పేర్కొంది.
అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్డ్ మందుల ధరలు ఈ మేరకు పెరుగుతాయి. ప్రజలు ఎక్కువగా వాడే పారాసెటమాల్ తో పాటు ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, మెట్రోనిడజోల్, అజిత్రోమైసిన్ వంటి ఔషధాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా కారణంగా ఔషధాల తయారీ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే వాటి ధరలు పెరగనున్నాయి.