Congress: ఆకలి రాజ్యంగా భారత్.. బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు
- గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విడుదల
- 101 వ స్థానంలో భారత్
- దేశంలో ఆకలి కేకలు పెరుగుతున్నాయన్న కాంగ్రెస్
భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం నిమిత్తం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచిక)ను ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై విమర్శలు గుప్పించింది.
ఈ సూచికలో 116 దేశాలు ఉంటే.. భారత్ 101వ స్థానంలో నిలిచిన వైనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. ఈ సూచికలో 101వ స్థానంలో దేశం ఉందంటే.. దేశంలోని ప్రజలు ఏ మేర ఆకలిలో కూరుకుపోతున్నారో ఇట్టే అర్థం అవుతోందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు బీజేపీ సర్కారు ఏమీ చేయడం లేదని కూడా నిందించింది. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? అంటూ కూడా దేశ ప్రజలను ప్రశ్నించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఓ పోస్ట్‌ను పెట్టింది.