Raghu Rama Krishna Raju: వివేకా కేసులో విజయసాయిని విచారించండి.... సీబీఐ చీఫ్ కు రఘురామకృష్ణరాజు లేఖ
- వివేకా కేసు నిందితులను చంపేందుకు కుట్ర అంటూ ఆరోపణలు
- నిందితులకు రక్షణ కల్పించాలన్న రఘురామ
- విజయసాయిని జైలుకు పంపేవరకు విశ్రమించనని రఘురాజు ప్రతిన
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐకి లేఖ రాశారు. పరిటాల రవి నిందితులను అంతమొందించిన కుట్ర తరహాలోనే వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను కూడా జైల్లోనే మట్టుబెట్టే కుట్ర జరుగుతోందని రఘురామకృష్ణరాజు తన లేఖలో ఆరోపించారు. జైల్లో ఉన్నవారికి, జైలు బయట ఉన్న నిందితులకు, సాక్షులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.
ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించాలని సీబీఐ చీఫ్ ను కోరారు. ఇప్పటికే ఎన్నో సీబీఐ కేసుల్లో విజయసాయి ఏ2గా ఉన్నారని, సీబీఐ ఆయనను పిలిచి వివేకా హత్య కేసులో ప్రశ్నించాలని తెలిపారు. ఈ కేసులో 'గొడ్డలి' అనే పదం ఎలా బయటికి వచ్చింది? ఈయనకు ఎవరు చెప్పి ఉండొచ్చు? అనే కోణంలో విచారించాలన్నారు. 'గుండెపోటు' అని చెప్పిన విజయసాయిరెడ్డిని విచారించాల్సిందేనని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డిని జైలుకు పంపేంతవరకు తాను విశ్రమించనని ఉద్ఘాటించారు.
కాగా, తాను సీబీఐకి రాసిన లేఖను మీడియాకు కూడా విడుదల చేస్తున్నానని రఘురామ వెల్లడించారు. తన లేఖను సాక్షి మీడియా కూడా ప్రచురించాలని సూచించారు.