Ravi Shastri: జడేజాకు అదొక లెక్కా...?: రవిశాస్త్రి
- ఐపీఎల్ లో కామెంటేటర్ గా రవిశాస్త్రి
- ఏడేళ్ల తర్వాత కామెంట్రీ బాక్స్ లోకి పునరాగమనం
- ఇటీవల చెన్నై కెప్టెన్ గా జడేజా నియామకం
- జడేజాకు కెప్టెన్సీని మించిన సామర్థ్యం ఉందన్న శాస్త్రి
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఐపీఎల్ లో కామెంటేటర్ అవతారం ఎత్తనున్నాడు. ఏడేళ్ల తర్వాత శాస్త్రి కామెంట్రీ బాక్స్ లోకి రావడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ, ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా నియమితుడైన రవీంద్ర జడేజా విషయం ప్రస్తావించాడు. చెన్నై కెప్టెన్ గా జడేజా రాణించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. జడేజా ఎంతో సామర్థ్యం ఉన్న ఆటగాడు అని కితాబునిచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ జడేజాకు ఏమంత కష్టం కాదని, అతడు అంతకుమించిన సత్తా ఉన్నవాడని కొనియాడాడు. తొలిసారి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జడేజా ఎంతో సూక్ష్మబుద్ధి ఉన్నవాడని, అతడి నిశిత దృష్టి అనేక అద్భుతాలు చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపాడు. గత కొన్నేళ్లుగా జడేజాను దగ్గరినుంచి గమనిస్తున్నానని, ఆటగాడిగా ఎంతో పరిణతి చెందాడని, అతడిలో ఆత్మవిశ్వాసం కూడా ఎంతో పెరిగిందని రవిశాస్త్రి వెల్లడించాడు. "జడ్డూ... మై ఫ్రెండ్... గుడ్ లక్. ఈ కెప్టెన్సీ నీకో లెక్క కాదు. నువ్వు అమోఘంగా రాణిస్తావు" అంటూ జడేజాకు శుభాకాంక్షలు తెలియజేశాడు.