Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలోకి దూసుకెళ్లి ఏడుగురి దుర్మరణం

7 dead in a road accident in Chittoor District

  • నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి ప్రైవేటు బస్సులో తిరుచానూరుకు
  • బస్సులో 63 మంది
  • భాకరాపేట ఘాట్ రోడ్డు సమీపంలో మూల మలుపులో అదుపుతప్పిన బస్సు
  • 60 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన బస్సు
  • 55 మందికి గాయాలు

చిత్తూరు జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇందుకోసం వేణు కుటుంబ సభ్యులు ధర్మవరం నుంచి ప్రైవేటు బస్సులో నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు 63 మందితో కలిసి తిరుచానూరు బయలుదేరారు. 

రాత్రి 8 గంటల సమయంలో పీలేరులోని ఓ దాబా వద్ద ఆగి అందరూ భోజనాలు చేసి తిరిగి బయలుదేరారు. అక్కడి నుంచి సరిగ్గా 9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక మూల మలుపు వద్ద బస్సు అదుపుతప్పి 60 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి కాళ్లు, చేతులు విరిగాయి. కొందరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు, వృద్దులు కూడా ఉన్నారు. 

ప్రమాదం రాత్రివేళ జరగడంతో రాత్రి పదిన్నర గంటల వరకు విషయం వెలుగులోకి రాలేదు. బాధితుల రోదనలు విన్న కొందరు వాహనదారులు ఆగి లోయలోకి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లోయలో చిక్కుకుపోయిన వారిని రక్షించారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మలుపు వద్ద డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News