Telangana: కు.ని. ఆపరేషన్ కు వచ్చిన మహిళలకు మత్తిచ్చి మధ్యలోనే వదిలేసిన వైద్యులు.. భువనగిరి జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం
- వివిధ గ్రామాల నుంచి వంద మందిని తీసుకొచ్చిన ఆశా కార్యకర్తలు
- 20 మందికి మత్తిచ్చిన వైద్యులు
- మిగతా వారు రేపు రావాలంటూ హుకూం
- తమకూ చేయాల్సిందేనని మహిళల పట్టు
- మత్తిచ్చిన వారినీ వదిలేసి వెళ్లిన వైద్యులు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన మహిళలకు మత్తు మందిచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేయబోమంటూ కర్కశత్వం చూపించారు. తుర్కపల్లి, రాజపేట మండలాల నుంచి మహిళలను కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం వంద మందిని ఆశాకార్యకర్తలు తీసుకురాగా.. అప్పటికే 20 మంది మహిళలకు మత్తు మందిచ్చి పడుకోబెట్టారు.
మిగతా వారికి ఆపరేషన్ చేయలేమని, రేపు రావాలని వారికి సూచించారు. అయితే, మిగతా మహిళలూ తమకు కూడా ఇప్పుడే ఆపరేషన్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో ఆసుపత్రి వైద్యులు.. అసలు ఎవరికీ ఆపరేషన్ చేసేది లేదంటూ మత్తు మందిచ్చిన మహిళలనూ మధ్యలోనే వదిలేసి వైద్యులు వెళ్లిపోయారు. దీంతో వైద్య సిబ్బందితో వారి కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగారు. భరోసా ఇచ్చి మరీ అంత మందిని కుటుంబ నియంత్రణ క్యాంపునకు తీసుకొస్తే.. ఆపరేషన్ చేయకపోవడమేంటని ఆశాకార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.