Yakov Ryezantsev: రష్యా సైనికాధికారులే ఉక్రెయిన్ లక్ష్యం... మరో జనరల్ ను మట్టుబెట్టిన వైనం
- ఉక్రెయిన్ పై దండయాత్రలో రష్యాకు ఎదురుదెబ్బలు
- రష్యా సైనికాధికారులు కనిపిస్తే వదలని ఉక్రెయిన్ సైన్యం
- ఏడుగురు జనరళ్లు సహా 15 మంది సైనికాధికారుల హతం
- ఒక్కరే చనిపోయారంటున్న రష్యా
ఉక్రెయిన్ పై సైనిక చర్యకు దిగిన రష్యాకు తల బొప్పికడుతోంది. ఇప్పటికే రష్యా వేలమంది సైనికులను కోల్పోయినట్టు కథనాలు వచ్చాయి. అనేకమంది అగ్రశ్రేణి కమాండర్లు సైతం మరణించినవారిలో ఉన్నారు. రష్యా సైనిక జనరళ్లు ఉక్రెయిన్ గడ్డపై పెద్ద సంఖ్యలో మరణించడం చూస్తుంటే... శత్రు సైన్యంలోని పెద్ద తలకాయల కోసం ఉక్రెయిన్ బలగాలు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
రష్యా సైనిక జనరళ్లు కనిపిస్తే చాలు... వారిని మట్టుబెట్టడమే పరమావధిగా ఉక్రెయిన్ సాయుధ కమాండోలు వ్యూహాత్మక దాడులు చేస్తున్నారు. దాని ఫలితమే తాజాగా రష్యా మరో సైనిక జనరల్ ను కోల్పోయింది. ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాల ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అతడిని యాకోవ్ రెజాంట్సేవ్ గా గుర్తించారు. అతడు రష్యా సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్నాడు. ఉక్రెయిన్ దాడుల్లో మరణించిన జనరల్ హోదా ఉన్న అధికారుల్లో రెజాంట్సేవ్ ఏడోవ్యక్తి. కాగా, కమాండర్లతో కూడా కలిపి ఇప్పటివరకు 15 మంది రష్యా సైనికాధికారులను హతమార్చినట్టు ఉక్రెయిన్ చెబుతోంది.
సైనికాధికారులను చంపేస్తే రష్యా సైన్యం నాయకత్వం లేక దిక్కుతోచని స్థితిలో పడుతుందన్నది ఉక్రెయిన్ వ్యూహంగా కనిపిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా ఈ స్థాయిలో సైనిక జనరళ్లను ఎప్పుడూ కోల్పోలేదు. చెచెన్యా యుద్ధంలోనూ, ఆఫ్ఘనిస్థాన్ గడ్డపైనా రష్యాకు ఈ విధమైన నష్టం జరగలేదు. అయితే, రష్యా అధ్యక్ష కార్యాలయం మాత్రం ఇప్పటివరకు ఒక్క సైనికాధికారి మాత్రమే మరణించాడని పేర్కొంది.