East Godavari District: అవును, రోజూ క్వార్టర్ తాగి, దమ్ముకొట్టి బడికి వస్తున్నా: ఉపాధ్యాయులకు రాసిన లేఖలో 9వ తరగతి విద్యార్థి
- తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో ఘటన
- వ్యసనాలకు బానిసైన ఐదుగురు విద్యార్థులు
- ఇటుక బట్టీలో పనిచేసి వచ్చే డబ్బులతో మద్యం తాగుతున్నట్టు లేఖ
- పి.గన్నవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలోనే క్వార్టర్ కొంటున్నట్టు పేర్కొన్న విద్యార్థి
‘‘అవును నేను రోజూ మద్యం తాగి స్కూలుకొస్తున్నా. బడి దగ్గర్లోనే ఉన్న దుకాణంలో సిగరెట్లు కొని కాలుస్తున్నా. డబ్బుల కోసం ఇటుక బట్టీలో పనిచేస్తున్నా. కానీ ఇకపై మాత్రం ఇలా చేయను’’ అని పేర్కొంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్థి రాసిన లేఖ చూసి ఉపాధ్యాయులు షాకయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మద్యం తాగి స్కూలుకు వచ్చినట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. దీంతో అతడి తండ్రిని స్కూలుకు పిలిపించి విషయం చెప్పారు. దీనికి ఆ తండ్రి బదులిస్తూ.. ఇంటి వద్ద తామెంతగా చెబుతున్నా వినడం లేదని, మీరైనా చెప్పి కుమారుడిని దారిలో పెట్టాలని అభ్యర్థించి వెళ్లిపోయాడు.
అనంతరం ఆ విద్యార్థి ఓ లేఖ రాస్తూ ఇకపై ఈ అలవాట్లు మానుకుంటానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చాడు. అందులో అతడు రాసింది చదివిన ఉపాధ్యాయులకు మతి పోయినంత పనైంది. తాను రోజూ కనీసం క్వార్టర్ మద్యం తాగుతానని, స్కూలు దగ్గర్లో ఉన్న దుకాణంలో సిగరెట్లు కొని కాల్చి స్కూలుకు వస్తున్నానని పేర్కొన్నాడు.
అంతేకాదు, పి.గన్నవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుంటున్నానని, ఇందుకు అవసరమయ్యే డబ్బుల కోసం ఇటుక బట్టీలో పనిచేస్తున్నట్టు వివరించాడు. అయితే, ఇకపై మాత్రం ఇలా చేయనని హామీ ఇస్తూ ఆ లేఖలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కాగా, ఇదే స్కూలులో మొత్తం ఐదుగురు విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు బానిసలయ్యారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.