Kim Jong Un: అత్యాధునిక క్షిపణులను తయారు చేస్తాం: ఉత్తర కొరియా అధ్యక్షుడి ప్రకటన
- ఎవరూ అడ్డుకోలేని గొప్ప సైనిక శక్తి, సామర్థ్యాలు ఉండాలి
- అప్పుడే ఓ వ్యక్తి యుద్ధాన్ని నిరోధించగలడు
- అలా చేస్తేనే సామ్రాజ్యవాదుల బెదిరింపులను అదుపులో ఉంచగలం
- తమ దళాలను ఎవరూ అడ్డుకోలేరన్న కిమ్
తమ దేశ సైన్యాన్ని మరింత శక్తిమంతం చేసేందుకు అత్యాధునిక క్షిపణులను తయారు చేస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటన చేశారు. ఎవరూ అడ్డుకోలేని గొప్ప సైనిక శక్తి, సామర్థ్యాలు ఉంటేనే ఓ వ్యక్తి యుద్ధాన్ని నిరోధించగలడని కిమ్ జాంగ్ ఉన్ పలు వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తేనే సామ్రాజ్యవాదుల బెదిరింపులను అదుపులో ఉంచగలమని చెప్పారు.
తమ ఆత్మరక్షణ దళాలను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ఆయన పరోక్షంగా అమెరికాకు వార్నింగ్ ఇవ్వడంతో అలజడి రేగుతోంది. ఇప్పటికే ఉత్తర కొరియా ఎన్నో క్షిపణి పరీక్షలు చేసి కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 11 క్షిపణి ప్రయోగాలు చేసింది. మూడు రోజుల క్రితం అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్–17ను విజయవంతంగా ఉత్తర కొరియా పరీక్షించింది. అది 1,090 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా-జపాన్ మధ్య సముద్ర జలాల్లోని లక్ష్యంపై పడింది.
ఉత్తర కొరియా చర్యల పట్ల దక్షిణ కొరియా, జపాన్, అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను ఉత్తర కొరియా ధిక్కరిస్తోందని అమెరికా పేర్కొంది. ఉత్తర కొరియా చర్యలను క్షమించలేమని జపాన్ తెలిపింది. ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతోన్న నేపథ్యంలో కిమ్ జాంగ్ ఉన్ క్షిపణుల ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.