Pramod Sawant: రెండోసారి సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం.. హాజరైన మోదీ!
- పనాజీలో అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం
- కొంకణి భాషలో ప్రమాణం చేసిన సావంత్
- కార్యక్రమానికి హాజరైన మోదీ, నడ్డా, ఫడ్నవిస్
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ రెండో సారి ప్రమాణస్వీకారం చేశారు. పనాజీలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు హాజరయ్యారు. ప్రమోద్ సావంత్ కొంకణి భాషలో ప్రమాణం చేశారు.
మరోవైపు రేపటి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ పీఎస్ శ్రీధరన్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో సావంత్ ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కొత్త స్పీకర్ ను కూడా ఈ సమావేశాల్లో ఎన్నుకుంటారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు వచ్చాయి. 40 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 21 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. దీంతో, బీజేపీ ప్రభుత్వానికి ఒక్క ఎమ్మెల్యే తక్కువ వచ్చారు. అయితే మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి తోడు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు.