TSRTC: తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏ బస్సులో ఎంతంటే..!
- ప్యాసింజర్ సెస్ పేరిట తాజా వడ్డన
- ఇప్పటికే ఆర్డినరీలో సెస్ పేరిట రూ.1 వసూలు
- దూరంతో సంబంధం లేకుండా చార్జీల మోత
తెలంగాణలో మరోమారు ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఇటీవలే కిలో మీటరుకు ఇంత అంటూ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చార్జీల పెంపును జనం మరిచిపోకముందే.. మరోమారు ఆర్టీసీ చార్జీలను పెంచుతూ సోమవారం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్తగా పెంచిన చార్జీలను ప్యాసింజర్ సెస్ పేరిట వసూలు చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆర్డినరీ బస్సుల్లో సెస్ పేరిట రూ.1 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రతిపాదించిన ప్యాసింజర్ సెస్‌ను ఆర్డినరీ బస్సులను మినహాయించి మిగిలిన బస్సుల్లో వసూలు చేయనున్నారు. పెంచిన ఈ చార్జీలను ఏమాత్రం ఆలస్యం లేకుండా సోమవారం నుంచే అమల్లోకి తెచ్చేశారు.
ఈ ప్యాసింజర్ సెస్.. ఎక్స్‌ప్రెస్,డీలక్స్ బస్సుల్లో రూ.5గా ఉండగా.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడల్లో రూ.10గా నిర్ణయించారు. ఈ సెస్ వసూలు కారణంగా దూరంతో సంబంధం లేకుండా జనంపై భారం పడనుంది. టికెట్ తీసుకున్న ప్రతి ప్రయాణికుడిపై ఈ సెస్‌ను వసూలు చేయనున్నారు.