Govt Teacher: ప్రభుత్వ ఉపాధ్యాయుడు 23 కాలేజీలకు యజమాని... ఆస్తులు చూసి అవాక్కయిన అధికారులు
- మధ్యప్రదేశ్ లో టీచర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ పర్మార్
- ఆర్థికశాఖ అధికారుల దాడులు
- పలు బీఈడీ, డీఈడీ, నర్సింగ్ కాలేజీలు నడిపిస్తున్న పర్మార్
మధ్యప్రదేశ్ లోని ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆస్తులు చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ ఉపాధ్యాయుడి పేరు ప్రశాంత్ పర్మార్. ఘాటిగావ్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. జీతం వేలల్లోనే ఉంటుంది.
అయితే, ప్రశాంత్ పర్మార్ 20 డీఈడీ, బీఈడీ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలకు యజమాని అంటే ఆశ్చర్యం కలగకమానదు. మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు చేసిన దాడుల్లో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. కోట్ల విలువ చేసే ఆస్తులకు అతడు అధిపతి అని తెలుసుకున్నారు. ఏకకాలంలో అతడి నివాసం, ఇతర ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. గ్వాలియర్, చంబల్ ప్రాంతాల్లో పర్మార్ అనేక కాలేజీలు నడిపిస్తున్నట్టు గుర్తించారు.
సాధారణ స్కూలు టీచర్ ఇన్ని కాలేజీలకు ఎలా యజమానిగా మారాడన్న విషయం అధికారులను విస్మయానికి గురిచేసింది. 2006లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పుడు ప్రశాంత్ పర్మార్ నెల జీతం రూ.3,500 కాగా, కొద్దికాలంలోనే ఈ స్థాయికి రావడానికి ఏ స్థాయిలో అక్రమాలు చేశాడో అని అధికారులు విస్తుపోయారు.