Nitin Gadkari: బలహీనపడిన కాంగ్రెస్ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేయడం శుభపరిణామం కాదు: నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ముంబయిలో అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ
- విపక్షం బలంగా ఉండాలని ఆకాంక్ష
- ప్రజాస్వామ్యంలో విపక్షానిది కూడా ముఖ్యపాత్రేనని వ్యాఖ్య
- ఆ విషయం మోదీకి చెప్పాలన్న కాంగ్రెస్ నేత సావంత్
ముంబయిలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ బలహీనపడడం, కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు భర్తీ చేయడం శుభ పరిణామం కాదన్నారు. ప్రజాస్వామ్యానికి అధికార పక్షం ఎంత ముఖ్యమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని గడ్కరీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించి, జాతీయస్థాయిలో క్రియాశీలకంగా మారాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు. ఇది తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని గడ్కరీ పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గడ్కరీ మాటలు తమకు ఆమోదయోగ్యమేనని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ అన్నారు. అయితే, విపక్షాలను అణచివేసేందుకు బీజేపీ చేస్తున్న రాజకీయాలపై గడ్కరీ ప్రధాని మోదీతో మాట్లాడగలరా? అని సావంత్ ప్రశ్నించారు.
గత ఎనిమిదేళ్లుగా ఇతర పార్టీలను వేధించడం కోసం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నది ఎవరు? అని నిలదీశారు. ఈ విషయాలన్నీ ప్రధాని మోదీతో గడ్కరీ మాట్లాడగలిగితే దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారని సావంత్ హితవు పలికారు.