Shopee: నెల రోజుల్లోనే భారత్‌లో వ్యాపారాన్ని మూసేసిన ‘షాపీ’
- నెల రోజుల క్రితం భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ‘షాపీ’
- అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల కారణంగా నిర్ణయం
- 300 మంది సిబ్బందికి వేరే ఉద్యోగాలు ఇప్పించడంలో సహకారం
నెల రోజుల క్రితం భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘షాపీ’ అంతలోనే తమ దుకాణం సర్దేసింది. భారత్‌లో వ్యాపారాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సింగపూర్‌కు చెందిన సీ లిమిటెడ్ ఈ సంస్థను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
ఆ సంస్థలో భారత్‌లో పనిచేస్తున్న 300 మంది సిబ్బందికి వేరే ఉద్యోగాలు ఇప్పించడంలో సహకరిస్తామని తెలిపింది. అలాగే ఉద్యోగం పొందడంలో విఫలమైన వారికి పరిహార ప్యాకేజీ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సింగపూర్‌లో నమోదైన సీ గ్రూపునకు చెందిన గరేనా ఫ్రీ ఫైర్ సహా 54 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. ఈ నేపథ్యంలో షాపీ తన కార్యకలాపాలను భారత్‌లో నిలిపివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఇదే సంస్థ గత నెలలో ఫ్రాన్స్‌లోనూ తమ కార్యకలాపాలను నిలిపివేసింది.