Pune: 15 ఏళ్లుగా మూసివున్న దుకాణంలో మానవ మెదడు, కళ్లు, చెవులు స్వాధీనం!
- దుర్వాసన వస్తుండడంతో స్థానికుల సమాచారం
- ఆయా భాగాలను నిపుణులు వేరు చేసినట్టు గుర్తించిన పోలీసులు
- హత్య కాదని ప్రాథమికంగా నిర్ధారణ
- కొనసాగుతున్న దర్యాప్తు
మహారాష్ట్రలోని నాసిక్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇక్కడి నాకా ప్రాంతంలో 15 ఏళ్లుగా మూసివున్న ఓ దుకాణంలో 8 మానవ చెవులు, మెదడు, కళ్లు, ముఖ భాగాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భవనం నేలమాళిగలో ఉన్న ఈ దుకాణం నుంచి దుర్వాసన వస్తుండడంతో భరించలేని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తుక్కుతో నిండిపోయిన ఈ దుకాణంలోని రెండు ప్లాస్టిక్ కంటైనర్లను తెరవగా ఇవి బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు ముంబై నాకా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇది హత్య కాకపోవచ్చని భావిస్తున్నారు.
మూసివున్న దుకాణం యజమాని ఇద్దరు కుమారులు మెడికల్ విద్యార్థులు కావడంతో వైద్య పరీక్షల కోసం వీటిని తెచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే, వాటిని రసాయనాల్లో ముంచినట్టు కూడా గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాకపోయినా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ కమిషనర్ పౌర్నిమా చౌగులే మాట్లాడుతూ.. నిజానికి అక్కడ మృతదేహం ఉండి ఉంటే హత్యగా భావించేవాళ్లమని కానీ, మొత్తం 8 చెవులను నిపుణులు కానీ, లేదంటే ఇదే పనిలో కొనసాగుతున్న వారు కానీ కత్తిరించినట్టు ఉండడంతో అది హత్య కాదని నిర్ధారించినట్టు చెప్పారు. అయితే, ఈ విషయమై తనకేమీ తెలియదని షాపు యజమాని పోలీసులకు తెలిపారు.