IPL: అప్పట్లో ఐపీఎల్ ఉండి ఉంటేనా.. రూ. 15 కోట్లు వచ్చేవి: రవిశాస్త్రి మనసులో మాట
- ఓ జట్టుకు కెప్టెన్‌గానూ ఉండేవాడినన్న రవిశాస్త్రి
- భారత క్రికెటర్లలో యువరాజ్‌కు అత్యధిక ధర
- ఓవరాల్‌గా క్రిస్ మోరిస్‌కు అత్యధిక ధర
తాను క్రికెట్ ఆడే సమయంలో కనుక ఐపీఎల్ వంటి టీ20 లీగ్ ఉండి ఉంటే వేలంలో తనకు రూ. 15 కోట్ల ధర పలికేదని, అలాగే, ఓ జట్టుకు కెప్టెన్‌గానూ ఉండేవాడినని టీమిండియా మాజీ సారథి, కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై అడిగిన ప్రశ్నకు రవి బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనకైతే కచ్చితంగా రూ. 15 కోట్ల ధర వచ్చేదని, ఓ జట్టుకు కెప్టెన్ కూడా అయ్యుండేవాడినని ఎవరైనా చెప్పగలరని అన్నాడు.
భారత్‌కు 80 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్‌రౌండర్ 3,830 పరుగులు చేశాడు. 151 వికెట్లు సాధించాడు. అలాగే, వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టిన రవిశాస్త్రి 3,108 పరుగులు చేశాడు. అప్పట్లో ఓ రంజీలో ఒకే ఓవర్లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర కెక్కాడు.
2015 ఐపీఎల్ మెగా వేలంలో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు యువరాజ్ సింగ్‌ను రూ. 16 కోట్లకు సొంతం చేసుకుంది. ఓ భారత క్రికెటర్‌కు పలికిన అత్యధిక ధర ఇదే. గత నెలలో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఇషాన్ కిషన్‌ను రూ. 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రెండో అత్యధికం. ఇక, ఓవరాల్‌గా చూసుకుంటే గతేడాది ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిసన్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేయగా, 2020లో పాట్ కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 15.5 కోట్లకు సొంతం చేసుకుంది.