Balakrishna: పోరాటమే మన ఊపిరి: నందమూరి బాలకృష్ణ
- నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతోంది
- పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే
- పారిశ్రామికీకరణకు చంద్రబాబు బ్రాండ్ అంబాసడరన్న బాలయ్య
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కంచుకోట అని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాటమే మన ఊపిరి అని... ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి ఇదేనని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతోందని అన్నారు. పార్టీ ఈ స్థాయిలో ఉండటానికి లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులే కారణమని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో టీడీపీ కొత్త శకాన్ని లిఖించిందని బాలయ్య అన్నారు. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ ఆస్తిహక్కును కల్పించారని... అది దేశానికే దిక్సూచిగా మారిందని చెప్పారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే అని అన్నారు. ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రం అన్నపూర్ణగా మారడానికి టీడీపీనే కారణమని చెప్పారు.
పారిశ్రామికీకరణకు టీడీపీ అధినేత చంద్రబాబు బ్రాండ్ అంబాసడర్ అని కొనియాడారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టిన ఘనత చంద్రబాబుదని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే టీడీపీ రథ చక్రాలని చెప్పారు. కార్యకర్తలే టీడీపీ ప్రగతి రథానికి చోదకశక్తులని అన్నారు. 40 ఏళ్లు కాదు.. 400 ఏళ్లయినా తెలుగువారి గుండెల్లో టీడీపీ సజీవంగా ఉంటుందని చెప్పారు. దుష్ట శక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా.. మన కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని అన్నారు.