Tax: పన్ను కట్టలేదని షాపులోనే చెత్త పారబోసిన కర్నూలు మునిసిపల్ సిబ్బంది
- చెత్త పన్ను వసూళ్లలో అధికారుల అత్యుత్సాహం
- కర్నూలు నగరంలో షాపులోనే చెత్తను పారబోసిన వైనం
- గతంలో షాపుల ముందు చెత్తను పారబోసిన అధికారులు
- వరుస ఘటనలతో చెత్త పన్ను వసూళ్ల తీరుపై విమర్శలు
చెత్త పన్ను వసూళ్లలో ఏపీ అధికార యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విమర్శలు కొనితెచ్చుకుంటోంది. ఏపీలో అందులోనూ కర్నూలు నగర పాలక సంస్థలో ఈ తరహాలో ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. చెత్త పన్ను కట్టలేదని పలు షాపుల ముందు చెత్తను పారబోసిన కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది..తాజాగా అదే నగరంలో ఈసారి ఏకంగా షాపుల ముందు కాకుండా షాపులోనే చెత్తను పారబోశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.
తాజా ఘటన వివరాల్లోకెళితే.. చెత్త పన్ను వసూళ్ల కోసం బయలుదేరిన నగర పాలక సిబ్బంది.. నగరంలోని కృష్ణా నగర్ పరిధిలోని పలు షాపులకు వెళ్లారు. ఇందులో భాగంగా ఓ డెలివరీ షాపు యాజమాన్యం పన్ను కట్టలేదు. దీంతో నగరంలో ఏరిన చెత్తను అక్కడికి తెప్పించిన అధికారులు.. సదరు చెత్తను ఆ డెలివరీ షాపులో పోశారు. షాపు యాజమాన్యం ఎంతగా అడ్డుకున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా షాపులోనే చెత్తను పారబోసి వెళ్లిపోయారు.