BJP: ప్రేక్షక పాత్రతో రైతులకు ఏపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోంది: సోము వీర్రాజు
- రైతాంగ సమస్యలపై సోము వీర్రాజు గళం
- మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్
- సీమ రైతాంగానికి తుంపరసేద్యం యంత్రాలను అందించాలని వినతి
- పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్
ఏపీ రైతాంగం సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గళం వినిపించారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రైతులకు నమ్మక ద్రోహం చేస్తోందని ఆరోపించిన ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేసిన ఆయన మరిన్ని అంశాలను ప్రస్తావించారు.
రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటుగా రాయలసీమ రైతాంగానికి తుంపర సేద్యం చేసేందుకు వీలుగా యంత్రాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలను సాధ్యమైనంత త్వరలో అందే విధంగా చర్యలు చేపట్టాలని వీర్రాజు కోరారు.
ప్రభుత్వ పెద్దలు మిల్లర్లకు తలొగ్గి రైతాంగం తలదించుకునేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, మిల్లర్ల దందాలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం రైతులకు నమ్మకద్రోహం చేసినట్టు కదా? అంటూ ఆయన కీలక అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.