Ukraine: కేవలం 30 మంది డ్రోన్ ఆపరేటర్లతో 65 కిమీ రష్యా కాన్వాయ్ ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్!
- ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు భారీ నష్టం!
- కీవ్ ను చేజిక్కించుకునేందుకు రష్యా యత్నం
- కీవ్ దిశగా భారీ సైనిక కాన్వాయ్
- బైక్ లపై వెళ్లిన ఉక్రెయిన్ డ్రోన్ ఆపరేటర్లు
- రాత్రివేళ ఆపరేషన్
- ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్ నెట్వర్క్ ద్వారా సమన్వయం
ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. కేవలం కొన్ని డ్రోన్లు, 30 మంది సిబ్బందిని ఉపయోగించి రష్యాకు చెందిన భారీ కాన్వాయ్ ను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ నెట్వర్క్ ను డ్రోన్లకు అనుసంధానించి జరిపిన ఈ దాడుల్లో 65 కిలోమీటర్ల మేర రష్యా సైనిక కాన్వాయ్ ధ్వంసం అయినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది.
రష్యా సైనిక కాన్వాయ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను దిగ్బంధనం చేసేందుకు వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడులను ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ దళం ఏరో రిజ్విడా చేపట్టింది. 30 మంది మెరికల్లాంటి డ్రోన్ ఆపరేటర్లు బైక్ లపై రష్యా కాన్వాయ్ కి చేరువగా వెళ్లారు. డ్రోన్లకు అమర్చిన బాంబులను గురితప్పకుండా రష్యా కాన్వాయ్ లోని యుద్ధ ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలపై జారవిడిచారు.
ఈ ఆపరేషన్ రాత్రివేళ జరిగినట్టు ఏరో రిజ్విడా వెల్లడించింది. తమ బృందం సభ్యులు అటవీ మార్గం గుండా ప్రయాణించి కాన్వాయ్ కు సమీపంగా వెళ్లారని, కాన్వాయ్ మొదట్లో ఉన్న రెండు, మూడు వాహనాలను ధ్వంసం చేయగానే కాన్వాయ్ నిలిచిపోయిందని వివరించింది. దాంతో, ఆ కాన్వాయ్ లోని ఇతర వాహనాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు జారవిడిచినట్టు పేర్కొంది. ఈ ఆపరేషన్ లో సమాచార మార్పిడి, సమన్వయం కోసం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అందించిన స్టార్ లింక్ శాటిలైట్ నెట్వర్క్ ను ఉపయోగించామని వెల్లడించింది.