Imran Khan: ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ క్షుద్ర పూజలు చేస్తున్నారు... పాక్ విపక్షం ఆరోపణ

Pakistan opposition alleges PM Imran Khan doing witch craft to save his govt
  • తీవ్ర రాజకీయ సంక్షోభంలో ఇమ్రాన్ ఖాన్
  • ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం
  • ఇద్దరు సభ్యుల రాజీనామా
  • ఇమ్రాన్ నివాసంలో వేల కోళ్ల దహనం!
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారు. ఆయన అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్నారు. సొంతపార్టీలోనే అసమ్మతి చవిచూస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషమ పరీక్ష నెగ్గడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా, అధికార పీటీఐ పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి ఆసిమ్ నాజిర్ రాజీనామా చేశారు. ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీలో చేరారు. 

అటు, సంకీర్ణం నుంచి తప్పుకుంటున్నట్టు బలూచిస్థాన్ కు చెందిన స్వతంత్ర సభ్యుడు అస్లామ్ భూటాని కూడా ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో విపక్షానికి అనుకూలంగా ఓటేస్తానని వెల్లడించారు. 

ఇదిలావుంటే, మూలిగే నక్కపై తాటిపండులా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ క్షుద్ర విద్యలకు పాల్పడుతున్నాడని పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షేబాజ్ షరీఫ్ ఆరోపించారు. తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఇమ్రాన్ చేతబడులు చేయిస్తున్నారని తెలిపారు. ఇమ్రాన్ నివాసంలో టన్నుల కొద్దీ కోళ్లను దహనం చేశారని వివరించారు. పేదలు ఆహారం దొరక్క అల్లాడుతుంటే, ప్రధాని నివాసం బని గలాలో మాత్రం టన్నుల కొద్దీ మాంసం కాల్చివేశారని మండిపడ్డారు. 

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. ప్రధాని నివాసంలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు తెలిసిందని అన్నారు. అయితే, ఇలాంటివేవీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గట్టెక్కించలేవని ఆమె స్పష్టం చేశారు.
Imran Khan
Witch Craft
Govt
Vote Of Trust
Pakistan

More Telugu News