Andhra Pradesh: 9 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు.. తెనాలి పాస్టర్ అరెస్ట్
- ఆరోపణలు ఎదుర్కొంటున్న పాస్టర్ అహరోన్ ప్రకాష్
- వైరల్ వీడియోలపై స్పందించిన మనోరంజని
- పాస్టర్‌కు ఇవ్వాల్సిన లక్షన్నర ఇవ్వకుండా తప్పించుకునేందుకేనని ఆరోపణ
తొమ్మిదేళ్ల బాలుడిపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పాస్టర్ అహరోన్ ప్రకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులను బెదిరించారంటూ వచ్చిన ఆరోపణలను క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనోరంజని ఖండించారు. బాధిత కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నట్టున్న వీడియో వైరల్ కావడంతో స్పందించిన మనోరంజని ఆరోపణలను తోసిపుచ్చారు.
గతంలో ఓ వాహనం విషయంలో పాస్టర్‌కు బాలుడి తండ్రి లక్షన్నర రూపాయలు ఇవ్వాలని, వాటిని ఇవ్వకుండా తప్పించుకోవడానికే ఈ కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాస్టర్‌ను చర్చి నుంచి తీసుకెళ్లిన విషయం తెలిసి మరికొందరు పాస్టర్లతో కలిసి తాను అక్కడికి వెళ్లినట్టు చెప్పారు. అయితే, అసలు విషయం తెలిశాక తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. బాధిత బాలుడికి వైద్య పరీక్షల విషయంలో తాను సహకరిస్తానని ఆమె చెప్పారు.
అయితే, కొందరు మాత్రం తమకు రూ. 20 లక్షలు ఇప్పించి కేసును సెటిల్ చేయాలని కోరారని, అందుకు తాను నిరాకరించడంతో.. తన వీడియోలు వైరల్ చేస్తామని ఫోన్ చేసి బెదిరించారని ఆమె అన్నారు. అన్నట్టుగానే వారు తన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారని వాపోయారు. వారు తనను బెదిరిస్తూ చేసిన వాయిస్ కాల్ రికార్డు తన వద్ద ఉందని మనోరంజని తెలిపారు.