Odisha: అసెంబ్లీలో స్పీకర్‌పైకి కుర్చీ ఎత్తి పడేసి విరగ్గొట్టిన ఒడిశా ఎమ్మెల్యే
- గనుల అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ వాయిదా తీర్మానం
- చర్చకు అంగీకరించని స్పీకర్
- ఆగ్రహంతో ఊగిపోయిన తారాప్రసాద్
అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు నిరసనలు తెలపడం సాధారణమైపోయింది. అయితే, ఆ క్రమంలో కొందరు సభ్యులు రెచ్చిపోతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ కలకలం రేపుతున్నారు. ఇటువంటి ఘటనే ఒడిశా అసెంబ్లీలో చోటుచేసుకుంది. గనుల అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి వాయిదా తీర్మానం ఇచ్చారు.
మైనింగ్ అక్రమాలపై జీరో అవర్‌లో చర్చించాలని పట్టుబట్టారు. అయితే, దాన్ని స్పీకర్ ఎస్ఎన్ పాత్రో తిరస్కరించారు. ఆ తర్వాత భోజన విరామం సమయంలో సభ వాయిదా పడింది. అనంతరం కూడా అదే అంశంపై చర్చకు అనుమతించాలని తారాప్రసాద్ కోరారు.
గనుల యజమానులు అక్రమంగా మైనింగ్ చేస్తూ ఒడిశాను దోచుకుంటున్నారని ఆరోపించారు. అప్పుడు కూడా చర్చకు స్పీకర్ నిరాకరించడంతో తారాప్రసాద్ ఆగ్రహానికి గురయ్యారు. హెడ్‌ఫోన్స్ విరగ్గొట్టడమే కాకుండా, స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి, అక్కడి కుర్చీని పైకెత్తి పడేయడంతో అది విరిగిపోయింది. ఆయన ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.