Raw Rice: ఉప్పుడు బియ్యం సేకరించబోం.. కేంద్రం కీలక ప్రకటన
- లోక్‌సభలో మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి కీలక ప్రకటన
- ఉప్పుడు బియ్యాన్ని సేకరించబోమని గత ఖరీఫ్‌లోనే చెప్పామని వెల్లడి
- నిబంధనల మేరకే ధాన్యం సేకరణ అంటూ పీయుష్ గోయల్ ప్రకటన
ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేసింది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని సేకరించబోదని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి లోక్ సభకు రాతపూర్వకంగా తెలిపారు. తమ తమ అవసరాల మేరకు ఆయా రాష్ట్రాలే స్వయంగా ఉప్పుడు బియ్యాన్ని సేకరించుకోవాలని కూడా ఆమె ప్రకటించారు. ఇదే విషయాన్ని గత ఖరీఫ్‌లోనే స్పష్టంగా చెప్పామని కూడా మంత్రి తెలిపారు. 2020-21 ఖరీఫ్‌కు సంబంధించి 47.49 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించినట్టు తెలిపిన మంత్రి.. ఇకపై ఉప్పుడు బియ్యాన్ని సేకరించేది లేదని తేల్చి చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ నిబంధనల మేరకే అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తాజాగా ఉప్పుడు బియ్యాన్ని సేకరించేది లేదంటూ మరో మంత్రి ప్రకటించడం గమనార్హం.