Ashok Babu: ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన వాళ్లు ఇప్పుడు ఫ్యాన్ వేయాలంటేనే భయపడుతున్నారు: అశోక్ బాబు
- విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు జగన్ సర్కారు సిద్ధమయింది
- పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడుతుంది
- జగన్ నిర్ణయాల వల్లే విద్యుత్ రంగం దెబ్బతిందన్న అశోక్
చీప్ లిక్కర్ ను కూడా భారీ ధరలకు అమ్ముతున్న జగన్ సర్కార్... తాజాగా కరెంట్ ధరలను కూడా పెంచేందుకు సిద్ధమయిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. జగన్ ప్రభుత్వం శ్లాబులను మార్చిందని... దీనివల్ల నిన్నటి వరకు 75 యూనిట్లకు రూ. 169 కట్టిన వారు రేపట్నుంచి రూ. 304 కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న 13 శ్లాబుల్ని 6 శ్లాబులుగా కుదించారని.. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుందని అన్నారు. ఇదే సమయంలో ఎక్కువ విద్యుత్ వాడే వారిపై తక్కువ భారం పడేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. స్విచ్ వేయకముందే షాక్ కొట్టే పరిస్థితిని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.
విద్యుత్ రంగం దెబ్బతినడానికి జగన్ నిర్ణయాలే కారణమని అశోక్ బాబు అన్నారు. బొగ్గు ఉత్పత్తి కేంద్రాలకు బకాయిలు పడటం, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం వంటి నిర్ణయాలు విద్యుత్ రంగాన్ని నాశనం చేశాయని చెప్పారు. ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రజలను బలి తీసుకుంటున్నారని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన జనాలు ఇప్పుడు ఫ్యాన్ వేయాలంటేనే భయపడిపోతున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయని దుష్ప్రచారం చేసిన జగన్... ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.