Kuppam: రెవెన్యూ డివిజన్‌గా మారిన కుప్పం
- చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం
- ఇటీవలే మునిసిపాలిటీగా మారిన వైనం
- 22 పట్టణాలు రెవెన్యూ డివిజన్లుగా మార్పు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వరుసగా రెండో వరాన్ని చేజిక్కించుకుంది. ఏపీలో వైసీపీ పాలన మొదలయ్యాక గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పంను మునిసిపాలిటీగా మారుస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కుప్పంను రెవెన్యూ డివిజన్‌గానూ మారుస్తూ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరిగిన కసరత్తులో భాగంగా కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని తీర్మానించిన జగన్ సర్కారు.. రాష్ట్రంలోని కొన్ని పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగానూ మార్చాలని భావించింది. ఇలా రాష్ట్రంలోని 22 పట్టణాలను రెవెన్యూ డివిజన్లుగా మారుస్తూ బుధవారం జగన్ నిర్ణయం తీసుకోగా.. దానికి కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ 22 కొత్త రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటిగా ఉంది.