Andhra Pradesh: గవర్నర్ వద్దకు ఏపీ కొత్త జిల్లాల ఆర్డినెన్స్
- రాజ్ భవన్‌కు కొత్త జిల్లాల ఆర్డినెన్స్
- గవర్నర్ ఆమోదం లభించగానే గెజిట్ విడుదల
- కొత్త జిల్లాల ఏర్పాటుపై వేగంగా పరిణామాలు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం నాడు ఈ అంశంపై జగన్ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పలువురు మంత్రులు, అధికారులతో భేటీ అయిన సీఎం జగన్.. 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోట్ ఫైల్‌ను వర్చువల్ ద్వారా భేటీ అయిన కేబినెట్ ముందు ఉంచారు. ఈ నోట్ ఫైల్‌కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆ వెంటనే ఆ నోట్ ఫైల్ కాస్తా ఆర్డినెన్స్ ముసాయిదాగా మారిపోయింది.
ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలకమైన అంకానికి తెర లేచింది. కొత్త జిల్లాల ఆర్డినెన్స్ ముసాయిదాను కాసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం పంపింది. ప్రస్తుతం వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన గవర్నర్ విజయవాడ తిరిగి రాగానే.. ఈ ఆర్డినెన్స్ ముసాయిదాకు ఆమోదం తెలపనున్నారు. గవర్నర్ ఆమోదం లభించగానే.. కొత్త జిల్లాలకు సంబంధించి ఫైనల్ గెజిట్ విడుదల కానుంది.