Janasena: ఫ్యాను గుర్తుకు ఓటేస్తే.. ఫ్యాన్లు తిరగని పరిస్థితి: జనసేన
- విద్యుత్ చార్జీల పెంపుతో వైసీపీ మోసం చేసింది
- విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకం
- ప్రజల పక్షాన రోడ్డెక్కుతామని జనసేన హెచ్చరిక
ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచుతూ జగన్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంపై జనసేన సెటైరిక్‌గా స్పందించింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన కారణంగా ఇప్పుడు ఇళ్లల్లో ఫ్యాన్ తిరగని పరిస్థితి దాపురించిందంటూ ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జనసేన ఓ ప్రకటనను విడుదల చేసింది.
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలను మోసం చేసిందని ఆ ప్రకటనలో జనసేన ఆరోపించింది. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన జనసేన.. ప్రజలపై భారం మోపాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. బాధ్యత కలిగిన విపక్షంగా ప్రజల పక్షాన రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు రాజమహేంద్రవరంలో జనసేన పీఏసీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తన ప్రకటనలో పొందుపరచింది.